Thursday, July 14, 2011

మురికివాడలో పుట్టిన వజ్రం

http://cdn8.wn.com/vp/i/18/8ff7cf18c1683e.jpg
పేదరికం ఆమెను చిన్నతనం నుంచి వేధించింది. కడు పు నింపుకునేందుకు ముంబై లోకల్‌ రైళ్ళలో క్లిప్పు లు, సూదులు అమ్ముకునేది. దుర్భరమైన ఆ జీవితం నుంచి సాక్షరత దిశగా ఆమె పయనం ఎన్నో మలుపులు తిరిగింది. అంటరాని వారిగా ముద్రపడిన తెగకు చెందిన ఆమె ఎన్నో సమస్యలను అధిగమించి తాను కోరుకున్న జీవితాన్ని అందుకున్నది. నేడు తనతోటి పిల్లలకు చదువు చెప్పడమే కాదు కంప్యూటర్‌ కోచింగ్‌ కూడా ఇస్తున్నది. ఆమే దుర్గ మల్లిగుడులు. ప్రపంచ సామాజిక సదస్సుకు భారత ప్రతినిధిగా ఆమె బ్రెజిల్‌ వెళ్ళి వచ్చింది.

tribal-girl 
పిన్నీసులు, సూదు లు అమ్ముకునే స్థితి నుంచి ఈ స్థాయికి రావడానికి 22 ఏళ్ళ ఈ యువతి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నది. వాటన్నింటినీ పట్టుదలతో అధిగమించింది. ముంబైలోని జోగేశ్వరిలో ఉన్న సంజయ్‌ నగర్‌ మురికివాడలలో పది అడుగు లు కూడా ఒక లేని చిన్న గదిలో నివసిస్తుంది. ఆ చిన్న గదే వారి ఇంద్రభవనం. దుర్గ, ఆమె తల్లిదండ్రులు, చెల్లెలు గోవిం ది ఆ గదిలో ఉంటారు. వారు సంచార జాతికి చెందిన వైదు తెగకు చెందిన వారు. అయితే మూడు దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్నారు. ప్రస్తుతం డీ నోటిఫై అయిన ఈ తెగ ఇంకా పంచాయితీలను నిర్వహిస్తుంది. శాంతి భద్రతలను కాపాడేం దుకు ఆ తెగకు చెందిన పెద్దలు పంచాయితీలు నిర్వహిస్తారు.

విస్తారంగా ఉండే ఆ మురికివాడలో వైదులను దూరంగా నెట్టివేశారు. వారికి అత్యంత సమీపంగా ఉన్న టాయిలెట్‌ 200 మీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడకి సమీపంలో ఉన్న పంపు నుంచి వచ్చే మురికినీరు పట్టుకోవడానికే ఆడపిల్లలు ప్రతి రోజూ తెల్లవారుజామున ఐదుగంటలకే పొడవాటి క్యూలలో నిలబడతారు. అందుకే ఆ తెగలో ఎక్కువ మంది క్షయ వ్యాధితో బాధపడుతున్నారని అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్స్‌ నీలిమ అక్కడి పరిస్థితులను వివరించింది. ఆ తెగకు చెందిన పురుషులు జీవనం గడపడానికి పాత స్టీల్‌ డబ్బాలకు మరమ్మత్తు చేయడం, రీసైక్లింగ్‌ చేయడం చేస్తారు. దానితో వచ్చే వారి సంపాదనలో సగానికి పైగా తాగుడుకే ఉపయోగిస్తారు.

తాగిన తర్వాత భార్యను చితకబాదడం అనేది అక్కడ సర్వసాధారణమైన విషయం అని దుర్గ తల్లి 63 ఏళ్ళు అంకూ బాయ్‌ చెప్పింది. రోజూ రెండు పూటలా కడుపు నింపుకునేం దుకే ఆ కుటుంబం పోరాటం చేయవలసి వచ్చేది. తాను చిన్నతనంలో ఏనాడూ ఇంట్లో వండిన వంటను చూడలేదని, ఎందుకంటే తాము తిండి కోసం రైళ్ళలోనూ, ఇళ్ళల్లోనూ అడుక్కునే వారమని దుర్గ గుర్తు చేసుకుంది.అయితే ఆ తెగలో చదువుకున్న తొలి యువతి దుర్గ అయిన తర్వాత పరిస్థితులు నాటకీయంగా మారనారంభించాయి.

ఆమె నేడు 12వ తరగతి పూర్తి చేసింది. ప్రస్తుతం ప్రాథమిక కంప్యూటర్‌ శిక్షణను ఇస్తోంది. అంతేకాదు, 40 మంది స్కూల్‌ పిల్లలకు కోచింగ్‌ సెంటర్‌ను నిర్వహిస్తోంది. అదంతా కన్నంలాంటి ఆమె ఇంటి నుంచే. అంతేకాదు, సామాజిక సదస్సులో తాను కలుసుకున్న పెరూ, అమెరికాకు చెందిన కొందరు స్నేహితులతో టచ్‌లో ఉండేందుకు కూడా ఆమె కంప్యూటర్‌ను వినియోగిస్తుంది. తనను సమీపంలో ఉన్న మునిసిపల్‌ పాఠశాలలో చేర్పించమని తన తల్లిదండ్రులకు స్వచ్ఛంద సంస్థ యువకు చెందిన కార్యకర్తలు ఎంతగా నచ్చ చెప్పవలసి వచ్చిందో దుర్గ గుర్తు చేసుకుంటుంది.

పాఠశాలలో చేరిన కొత్తల్లో ఆమెను, ఆమె సోదరిని విడిగా కూర్చుపెట్టేవారుట. ఎందుకంటే వారు మురికోడుతూ, కంపు కొడుతూ ఉండేవారమని దుర్గే చెబుతుంది. అయితే చదువులోను, ఆటల్లోనూ చురుకుగా ఉండడంతో వారికి సహ విద్యార్ధులు స్నేహ హస్తం అందించారుట. ఇదొక్కటే కాదు అక్షరాస్యత కలగడం వల్ల అనేక లాభాలు కలిగాయి వారికి. తన కుమార్తెలిద్దరూ పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించాక తాము అడుక్కోవడం మానేసి గౌరవప్రదంగా జీవించడం ప్రారంభించామని, దుర్గ తండ్రి తాగుడు కూడా మానేశాడని తల్లి అకూబాయ్‌ చెప్పింది.

దుర్గ నేడు ఆత్మవిశ్వాసం గల యువతి. నిరాధారంగా మొదలైన ఆమె ప్రయాణం ఈ స్థితికి చేరుకోవడం అంటే సాధారణమైన విజయం కాదు అని యువ సంస్థ కార్యకర్త రాజు భీసే అభిప్రాయపడ్డారు. తాము ఆమెకు మద్దతు, మార్గదర్శనం ఇచ్చామని కానీ ఆమె తనలో ఉన్న నాయకత్వ పటిమతో తన కాళ్ళపై తాను నిలబడిందని ఆయన అంటారు. దుర్గ సోదరి గోవింది ప్రస్తుతం జిఎన్‌ఐఐటి నుంచి సాఫ్ట్‌వేర్‌ కోర్స్‌ చేస్తున్నది. గోవింది తన కోర్స్‌ పూర్తి చేసిన తర్వాతే తన గ్రాడ్యుయేషన్‌ చేయాలని దుర్గ నిర్ణయించుకుంది. ఎందుకంటే ఇంటి బాధ్యత ఇద్దరిలో ఎవరో ఒకరు తీసుకోవాలి.

ముక్కుసూటిగా మాట్లాడడం దుర్గకు అలవాటు. బాలకార్మికతను గురించి చైతన్యం తెచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 16 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రకటించింది. కానీ అటువంటి పిల్లల తల్లిదండ్రులకు సరైన జీవనోపాధి కలిగించనంత వరకూ ఆ లక్ష్యం నెరవేరదని దుర్గ అభిప్రాయం. వీధి నాటకాలు వేయడం, పోస్టర్ల ద్వారా ప్రచారం, ఇంటింటికి వెళ్ళి బాలకార్మితకు వ్యతిరేకంగా మాట్లాడి జనాన్ని నచ్చచెప్పడం వంటివన్నీ కూడా నిరుపయోగమేనన్నది ఆమె భావన.

సామాజిక సదస్సుకు వెళ్ళి వచ్చిన తర్వాత దుర్గ వీధి బాలలు, మురికివాడలకు చెందిన పిల్లలతో కలిపి ఒక చిన్న సంస్థను ఏర్పాటు చేసింది. అదే బాల అధికార్‌ సంఘర్ష్‌ సంఘటన్‌ (హక్కుల కోసం బాలల పోరాటం). ఆమెను బాలల మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ముంబైకి చైర్మన్‌గా 500 మంది పిల్లలు కలిసి ఎన్నుకున్నారు. సామాజిక సదస్సుకు భారత్‌ నుంచి దుర్గతో పాటు కాళి సమల్‌ అనే బాలిక కూడా పాల్గొన్నది. ఆమె తండ్రి రిక్షా తొక్కేవాడు. కానీ అనారోగ్యం వల్ల రోజు కూలీగా మారాడు. కాళి కూడా కటక్‌లో ఒక ఇటుకలో బట్టీలో పని చేసేది. ఆ ప్రాంతంలోని సుప్రతీవ సంస్థ ఆమె పాఠశాలకు వెళ్ళేందుకు సాయపడింది. ప్రస్తుతం ఆమె పిల్లల హక్కుల గురించి ప్రచారం సాగిస్తోంది.

వీరితో పాటు సదస్సులో పాల్గొన్న మరొక యువతి సోనాల్‌ దనభాయి బరియా అనే 16 ఏళ్ళ గుజరాతీ యువతి. ఆమె తండ్రి డైమండ్‌ కట్టర్‌. ఆమె తండ్రి నెలకు 2,500 రూపాయలు సంపాదించేవాడు.ఏడుగురు కుటుంబ సభ్యులకు అదే ఆధారం. తండ్రికి కిడ్నీ ఆపరేషన్‌ జరగడంతో సోనాల్‌ స్కూల్‌ మానేసి నెలకు 550 రూపాయలు ఇచ్చే పనిలో కుదురుకుంది. ఈ యువతులందరి ఆర్థిక నేపథ్యం ఒక్కటే. అయితే ఏం వీరంతా నేడు కుటుంబము, సమాజమూ కూడా గర్వపడే స్థాయికి ఎదిగారు. జీవించడం నేర్చుకున్నారు.

Wednesday, July 13, 2011

స్టూడెంట్స్ ...... శాస్త్రవేత్తలయ్యారు

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే అవి శరవేగంగా పెరుగుతున్న మన అవసరాలతో పోటీ పడలేకపోతున్నాయి. అందుకే విద్యార్థులు రంగంలోకి దిగారు. పరిశోధనల ద్వారా సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలని సంకల్పించారు. పట్టుదలతో ముందుకు కదిలారు. చదువుకోవడంతో పాటు వివిధ ప్రాజెక్టులపై పరిశోధనలు చేశారు. పలు కొత్త అంశాలను కనుగొని శాస్త్రవేత్తలతో పాటు ప్రజల మన్ననలు పొందారు. అలా అద్భుతాలు చేసిన బెంగళూరు, మంగుళూరు, కాన్పూర్ విద్యార్థుల సరికొత్త ప్రయోగాల గురించి తెలుసుకుందాం రండి.

డీజిల్‌తో నడిచే బైక్
 
దేశంలో రోజురోజుకు చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఫలితంగా వాహన చోదకుల ఖర్చు తడిసిమోపెడు అవుతున్నది. డీజిల్ కంటే పెట్రోలు ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో పెట్రోలుతో మాత్రమే నడిచే ద్విచక్రవాహన చోదకులపై మరింత భారం పడుతోంది.

లక్షలాది మంది ప్రజల బడ్జెట్‌ను ప్రభావితం చేసే ఈ ఖర్చును తగ్గిస్తే ఎంతో లాభం కదా? అని ఆలోచించారు బెంగుళూరుకు చెందిన ఎం.ఎస్. రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన నలుగురు మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు. రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన వి.వి.నవీన్, టోనీపాల్, నదీమ్ అన్వర్, సంజయ్ భూషణ్‌లు నలుగురూ నడిచే దారిలో కాదు.. కొత్తగా ఆలోచించాలి. పదిమందికీ ఉపయోగపడే పని ఏదైనా చేయాలని తపనపడుతూ ఉంటారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి పెట్రోల్ ధరలు చుక్కల్ని తాకుతున్న నేపథ్యంలో లక్షలాది మందికి ఉపయోగపడే డీజిల్ బైక్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు.

ఇంధన ఆదాతోపాటు, డీజిల్‌తో నడిచేలా ఆటోమెటిక్ గేర్స్, ఆటోమెటిక్ క్లచ్‌లతో కూడిన ద్విచక్ర వాహనాన్ని కనుగొనే ప్రాజెక్టు చేపట్టారు. కెనటిక్ బ్లేజ్, బుల్లెట్ ఇంజన్‌లను తీసుకొని వాటికి మార్పులు, చేర్పులు చేసి సరికొత్త డీజిల్ బైక్‌ను రూపొందించారు. బెంగళూరు, కోయంబత్తూర్ లలోని వర్క్‌షాప్‌లలో ఈ కొత్త ఇంజిన్, గేర్‌బాక్సులను తయారు చేశారు. ఆటోమెటిక్ గేర్లు, క్లచ్‌లు తేలికగా పనిచేసేలా రూపొందించటం వల్ల ట్రాఫిక్‌లో సులువుగా డీజిల్ బైక్ నడిపేందుకు వీలు కలిగిందని మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు వి.వి.నవీన్, సంజయ్ భూషణ్‌లు చెప్పారు.

ఈ డీజిల్ ఇంజిన్ మిగతా ఇంజన్‌ల కంటే కూడా మెరుగైనదని, ఈ బైక్ లీటరు డీజిల్‌కు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని దీన్ని రూపొందించిన విద్యార్థులు టోనీపాల్, నదీమ్ అన్వర్‌లు చెప్పారు. నాలుగు నెలల పాటు పరిశోధనలు చేసి, ఎంతో కష్టపడి ఈ బైక్‌ను రూపొందించినట్లు వారు చెప్పారు. పెట్రోలుతో నడిచే బైక్‌కు కిలోమీటరుకు 1.70పైసలు ఖర్చు అవుతుందని, కాగా డీజిల్‌తో నడిచే తమ బైక్‌కు కిలోమీటరుకు నలభైపైసలే ఖర్చు అవుతుందని విద్యార్థులు లెక్కలు కట్టారు. తాము రూపొందించిన సరికొత్త డీజిల్ బైక్‌తో మధ్యతరగతి ప్రజల రవాణా ఛార్జీలు తగ్గుతాయని ఆ విద్యార్థులు చెప్పారు. మేం రూపొందించిన ఈ డీజిల్‌బైక్‌కు త్వరలో పేటెంట్ కూడా తీసుకుంటామని ఆ విద్యార్థులు ఆనందంగా చెప్పారు.

అంగారకుడి గుట్టువిప్పే రోబో!
బెంగుళూరు కుర్రాళ్లు డీజిల్‌బైక్ కనిపెడితే మంగుళూరు విద్యార్థులు ఏకంగా అంగారక గ్రహం సంగతి చూడాలనుకున్నారు. నాసా ఇచ్చిన స్ఫూర్తితో మంగళూరులోని ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు అంగారక గ్రహం రహస్యాలు కనుగొనేందుకు నడుం కట్టారు. మూడు నెలల పాటు శ్రమించి అంగారక గ్రహం మీద నేల ఎలా ఉంటుంది.

ఏ అకృతిలో ఉంటుంది? అక్కడ నీరు ఉందా అనే అంశాలను కనిపెట్టే రోబోను రూపొందించారు. మంగుళూరు ఇంజినీరింగ్ విద్యార్థులు సచిన్ , బాలచంద్రహెగ్డేలతోపాటు ఏడుగురు కలిసి ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. " ఓ రోజు యూట్యూబ్ చూస్తున్నాం. అందులోని నాసా వీడియో నాతోపాటు నా స్నేహితుల బృందాన్ని ఎంతో ఆకట్టుకుంది. నాసాలో చేస్తున్న పరిశోధనల్లాగా మేమెందుకు చేయకూడదు అనిపించింది. మన దేశంలోనూ అధునాతన పరిశోధనలు చేయాలి అని కృత నిశ్చయానికి వచ్చాం. నాసా వీడియో ఇచ్చిన స్ఫూర్తితో పరిశోధనలు జరిపి సరికొత్త హైటెక్ రోబోట్‌ను రూపొందించాం'' అన్నారు ఇంజినీరింగ్ విద్యార్థి సచిన్.

అంగారకుడి గుట్టు విప్పే ఈ రోబోలో ఉష్ణోగ్రత, పీడనం, లోహం, నీటితో కూడిన సెన్సార్‌లు అమర్చామని చెప్పారు ఆ విద్యార్థులు. పిన్‌హోల్ కెమెరాతో పాటు వైర్‌లెస్ నావిగేషన్, బ్యాటరీ ఛార్జింగ్ కోసం సోలార్ ప్యానల్ , 12.7 ఆంప్లీల బ్యాటరీలను ప్రత్యేకంగా రూపొందించామని విద్యార్థులు చెప్పారు. మేం రూపొందించిన హైటెక్ రోబో ఇప్పటి వరకు ఎవరూ ఛేదించని అంగారకగ్రహం రహస్యాలను ఛేదిస్తుందని ఆ విద్యార్థులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బడా శాస్త్రవేత్తలు సైతం సాధించలేని విజయాలను మంగుళూరు కళాశాల విద్యార్థులు సాధించడం నిజంగా అభినందనీయం. వారికి హేట్సాఫ్ చెబుదాం!

తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్తు
కాన్పూర్ ఐఐటీ విద్యార్థులు చదువుల్లోనే కాదు ప్రయోగాల్లో సైతం తమ సత్తా నిరూపించు కోవాలనుకున్నారు. ఇందుకు అధ్యాపకులు సహకారం కూడా తోడయింది. ఏం చేయాలి? అని ఆలోచించారు. తాము చదువుకొనే కళాశాలకు సమీపంలోని నాన్కారీ, బారాసిరోహీ, సింగ్‌పూర్, బకుంతపూర్, నారమావు, కచ్చర్ గ్రామాలను పరిశీలించారు. ఆ గ్రామాలను విద్యుదీకరించినా ఎప్పుడూ విద్యుత్ సరఫరా అయ్యేది కాదు. ఆ గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడడాన్ని విద్యార్థులు గ్రహించారు. నిత్యం అంధకారంలో మగ్గుతున్న ఆరు గ్రామాల్లో వెలుగులు నింపాలని సంకల్పించారు విద్యార్థులు.

కరెంట్ నిరంతర సరఫరా లేనందు వల్ల ఆ గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటప్పడు సోలార్ విద్యుత్ అందిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. సాధారణంగా సోలర్ విద్యుత్ సరఫరాకు మామూలు కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అంత ఖర్చు లేకుండా, అతి తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్ సరఫరా చేసేందుకు వాళ్లు ప్రయోగాలు ప్రారంభించారు. పరిశోధనలు చేశారు. ప్రొఫెసర్ల సహకారం తీసుకున్నారు. చివరకు ఆ విద్యార్థుల కృషి ఫలించింది. తక్కువ ఖర్చుతోనే 500 కిలోవాట్‌ల సామర్ధ్యం గల సోలార్ ప్లాంట్‌ను నెలకొల్పి ఆరుగ్రామాలకు విద్యుత్తును అందించారు.

ఈ ప్రాజెక్టుకు సైన్సు అండ్ టెక్నాలజీ డిపార్టుమెంట్ ఆర్థిక సహకారం అందించింది. "ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఆరు గ్రామాలకు సోలార్ విద్యుత్తు అందించటం పెద్ద సమస్య కాదు. కానీ మా ఐఐటీ విద్యార్థులు తమ పరిశోధనలతో అతి తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు'' అన్నారు ఆ సంస్థ డైరెక్టరు ప్రొఫెసర్ సంజయ్ జి.దండే. విద్యార్థులు పంచిన వెలుగులతో ఆ ఆరు గ్రామాలు ఈ రోజున కొత్త వెలుగులు చిమ్ముతున్నాయి. సామాజిక స్పృహతో కొత్త ప్రయోగాలు చేసిన విద్యార్థులు ప్రజల జేజేలు అందుకుంటున్నారు.